Tuesday, 13 May 2014

సందేహాలు~సమాధానాలు

1. సంధ్యా సమయానికి ఆఫీసులో  ఉండాల్సిన పరిస్తితి వస్తే (లేదా /ప్రయాణంలో/మీటింగ్లో/నీళ్ళు దొరకని,స్నానంకుదరని )- కాలతిక్రమణ కాకుండా ఎల చెయ్యలో శాస్త్రంలో వివరించబడి ఉందా?
 - ఈ ప్రశ్నకి నిక్కచ్చిగా చెప్పాలంటే, మనం ఆఫీసులో ఉన్నప్పుడు క్రియారూపంగా సంధ్యావందనం చేయలేము కాబట్టి, అందునా , ఎవరి సీట్లో వారు ఉన్నప్పుడు కాకుండా, ఏ మీటింగ్ లోనో ఉన్నట్లయితే, మరీ కుదరదు. అలాంటప్పుడు, వీలు కుదిరితే ఆఫీసులో మానసికముగా సంధ్య చేయడము, అదీ కుదరలేదా ఇంటికి వచ్చి ప్రాయశ్చిత్తముతో చేయడం. ఇక నీళ్ళు దొరకకపోవడమే సమస్య అయితే, మట్టితో కూడా అర్ఘ్యం ఇవ్వవచ్చు అని చెప్పారు. ఇది మహాభారతములో భీష్మాచార్యుల వారు చేశారు కూడా. స్నానం చేయకపోతే, గోధూళి మీద పడేలా వాటి వెంట నడిస్తే, స్నానం చేసినట్లే, అదీ కుదరకపోతే విభూతి స్నానం చేయడమే. నిజంగా స్నానం చేయడం గురించి తెలియాలంటే, మన పూజ్య గురువు గారు చెప్పిన అష్ట పుష్ప పూజ వినండి. ఎన్నో విషయాలు తెలుస్తాయి.


2. సంధ్యావందనానంతరం ఆర్ఘ్య/తర్పన చేసిన జలాన్ని తాగవచ్చా లేక మొక్క మొదట్లొనే వెయ్యాలా - ఒకసారి అర్ఘ్యం ఇచ్చిన జలము లేక తర్పణ చేసిన జలము, చివరలో పరబ్రహ్మార్పణమస్తు అని వదిలిన జలము వేటినీ తాగకూడదు. అవి కేవలం తులసి మొక్క మొదట్లో పోయాలి. అర్ఘ్య/తర్పణములు ఇవ్వగా మిగిలిన కలశలో జలాన్ని, చివరన తీర్థంగా పుచ్చుకోవాలి. 

3. గాయత్రికి ఎమైనా నిర్దిష్టమైన సంఖ్య ఉందా - గాయత్రి జపం శాస్త్రం ప్రకారం ప్రతీ రోజూ 1008 సార్లు చేయాలి, అది కుదరకపోతే కనీసం 108, అదీ కుదరక పోతే కనీసం 28 సార్లు, ఇక మరీ ఆరోగ్యం బాగోక మంచం మీద నుంచి లేవలేకపోతే అప్పుడు 11 సార్లు చేయాలి. అదే పనిగా 11సార్లో లేక కేవలం 28 సార్లో చేస్తూ వెడితే, ఏ పరిస్థితులలో అంతమాత్రమే చేయవచ్చు అని శాస్త్రం చెప్పినదో, నిజంగా ఆ వ్యక్తికి ఆపరిస్థితులు వస్తాయి అని కంచి పరమాచార్య నడిచే దేవుడు చెప్పారు. అంటే, మన శక్తి కన్నా తక్కువ చేస్తే, పోను పోను, ఆ వ్యక్తి తేజస్సు క్షీణించిపోయి, అనారోగ్యముల పాలవుతాడు. ఇది ఎవరినీ బెదిరించడానికి చెప్తున్న మాట కాదండీ. జగద్గురువుల వాక్కు. అంటే నాకు ఉద్యోగం కదండీ, అస్సలు సమయం కుదరదు అని మనము సాకులు చెప్పుకుంటే (నాబోటి గాడికి సుమండీ...), మనసుంటే మార్గం ఉండకపోదు. ఆఫీసు నుంచి ఆలస్యం అయి, ఏ తొమ్మిదింటికో వచ్చినా సరే భోజనం చేయడం మానం లేదా ఒక్కసారి అయినా టీవీలో ముఖ్యాంశాలు చూడడం వదలము... అలా ఎన్నో పనులలోంచి సమయం తీసి ఇక్కడ ఈ విహిత కర్మ చేయడానికి వెచ్చిస్తే, వారు ధన్యులు. అమ్మ కృప అతి త్వరగా పొందుతారు. పూజ్య గురువు గారు ఇంకో మాట కూడా చెప్పారు, అన్నీ అనుకూలముగా ఉన్నప్పుడు సంధ్యావందనము చేయడము, సహస్ర గాయత్రి చేయడం పెద్ద గొప్ప కాదు, మనకి కొన్ని పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పుడు చేయగలిగితే అది గొప్ప అని.

4. అంగన్యాస కరన్యాసములు నాకు రావు కాని పుస్తకంలో చూసి చెస్తున్నా - వాటి అంతరార్థం తెలీదు. వాటి ప్రాముఖ్యత తెలిపే వెబ్ సైట్ లేదా పుస్తకం కలదా - ?


you tube లోని ఈ లంకె ని చూడగలరు.
http://www.youtube.com/watch?v=pGbX1RDywuk
 

5. ఆఫీసుకు వెళ్ళెముందే ప్రాత: మాధ్యాన్నిక సంధ్యావందనం చెయ్యొచ్చా ?- 
చేయవచ్చు. ప్రాతఃకాలం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల తరువాత సమయాన్ని సంగవ కాలమంటారు, అప్పుడు మాధ్యాహ్నికము కూడా చేసుకుని ఆఫీసుకి వెళ్ళవచ్చు నిస్సందేహముగా. ఇది శ్రీ పరమాచార్య వారి వాక్కు.

6. ఒక వేళ ఆఫీసులో మానసికంగా అర్ఘ్యం ఇవ్వచ్చ (మళ్ళీ ఇంటికి వెళ్ళాక స్నానం చేసి మళ్ళీ అర్ఘ్యం ఇవ్వడం సరి అయిన పద్దతేనా) - ? .

ఆఫీసులో మనసికముగా చేసి, మళ్ళీ ఇంటికి వచ్చి అర్ఘ్యం చక్కగా ఇవ్వవచ్చు. శ్రధ్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా స్వామి, మన శ్రధ్ధయే అన్నిటికి మూలం కదా. 

7. 16 సంవత్సరాలు దాటిన తరువాత ఉపనయనం చేసి ప్రయొజనం లేదు అంటారు - మరి ఇంట్లో వారికి తెలియక పిల్లలకు ఆలస్యంగా ఉపనయనం చేస్తే, ఆ తల్లి తండ్రులకు ఆ దోషం రాకుండ, ఉపనయనం నిరర్ధకమవ్వకుండా ఎమైనా ప్రాయశ్చిత్త విధి ఉన్నదా?

పూజ్య గురువుగారు చెప్పినట్లుగా 16 సం దాటాక ఉపనయనం చేసినా ఉపయోగం ఉండదు అనేది నిజమే, కానీ అలా కాని వారు (నాకూ కాలేదండి...దురదృష్టవశాత్తు..) బెంగ పడవద్దు. ఎప్పటికి ఎంత తెలిస్తే, అంతా త్రికరణశుధ్ధిగా ఆచరిద్దాము. బాల్యములో ఎనిమిదవ ఏట ఉపనయనం జరగకపోవడం వల్ల ఎంత గాయత్రి చేయాలో, అంతా ఇంకా దానికన్నా ఎక్కువ ఇప్పుడు పట్టుదలతో చేద్దాం... గాయత్రీ అమ్మవారు తప్పక కరుణిస్తారు. ఒక ప్రక్కన మన గురువు గారి సింహనాదం వింటూ, మరో ప్రక్క ఎడతెరిపి లేకుండా గాయత్రీ జపం చేద్దాం. అక్షరలక్షలు పూర్తి చేద్దాం. మన భరతమాత గడ్డ మీద, ఈ ఋషి పరంపర ఉన్న ఈ నేల మీద పుట్టినందుకు, అందునా ద్విజులమై జన్మించినందుకు, మనం అందరమూ మన జీవితములో ఒక్క సారైనా ఒక్క పురశ్చరణ చేద్దాం. (అంటే 24 లక్షల సార్లు జపం చేయాలి..) ఎందుకు చేయలేము. ఈ target ఒక్క సంవత్సరములోనో రెండులోనో కాదు, కనీసం 24 సంవత్సరాలలో...సంవత్సరానికి లక్ష చొప్పున. అమ్మ కరుణిస్తుంది. ఇవన్నీ చేస్తూ, మనకి భావి తరాల పిల్లలకి చక్కగా గర్భాష్టములో శాస్త్ర ప్రకారం ఉపనయం చేద్దాం అని సంకల్పం చేద్దాం. ఒకవేళ ఆ సమయానికి అంత డబ్బు నా దగ్గర ఉండదేమో ఎలా అనుకుంటారా... ఉపనయనము ఆడంబరము కోసం చేసే ఉత్సవం కాదు అని గుర్తెరిగి... కావాలంటే కామకోటి పీఠంలో సామూహిక ఉపనయనములు జరుగుతాయి. 

Sunday, 9 February 2014

YajurvEda sandhyavandanam Mudras

The First Two Images showing .. the 24 Gayatri Mudras and the Third Image details you about the 8 Uttara Mudras...




యజుర్వేద, సామవేద, అదర్వణవేద, ఋగ్వేద సంధ్యా వందనం

యజుర్వేద, సామవేద, అదర్వణవేద, ఋగ్వేద సంధ్యా వందనం

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు

"గాయిత్రిని మించిన మంత్రం తల్లిని మించిన దైవం" లేదు అంటారు అలాంటి గాయిత్రి మంత్రం ఎలా పుట్టింది దాని విశిష్టత , అర్ధం మొదలగు అంశాలను తెలుసుకోవాలని ఉందా ? ఆధినిక ఖగోళ శాస్త్ర రీత్యా కూడా దానిలో నిగూడమైన అర్ధం ఇవన్ని తెలుసుకోవాలి అంటే సీనియర్ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు అందించిన ఈ వ్యాసం తప్పకుండా చదవండి .

గాయత్రి మంత్ర అంతరార్ధం – భండారు శ్రీనివాసరావు

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

‘న గాయత్ర్యాః పరం మంత్రం నమాతు: పరదైవతం’ అన్నది జగత్ప్రసిద్ధమయిన వృద్ధవచనం

గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
ఆదిశంకరాచార్యులు తమ భాష్యములో ఈ మంత్ర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’ అని పేర్కొన్నారు. ‘గయలు’ అంటే ప్రాణములు అని అర్ధం. అలాగే ‘త్రాయతే’ అంటే కాపాడడమని భావం. కాబట్టి ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రమని శంకర భాష్యం.

ఈ మంత్ర శక్తిని గుర్తించిన వాడు కనుకనే వాల్మీకి మహర్షి తన రామాయణ రచనలో గాయత్రి మంత్రంలోని బీజాక్షరాలను చక్కగా ఉపయోగించుకోవడం జరిగిందన్నది పండిత ప్రకర్షుల ఉవాచ. రామాయణంలోని ప్రతి వేయి శ్లోకాలకు ఆరంభంలోనే ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి ఇరవై నాలుగు అక్షరాలతో మొత్తం ఇరవై నాలుగువేల శ్లోకాలతో రామాయణాన్ని పూర్తిచేశారని ప్రతీతి.
గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరం ఒక బీజాక్షరం మాత్రమే కాక మహా మహిమాన్వితమైనదన్నది మన పూర్వీకుల నమ్మకం. ఈ మంత్రంలోని ప్రతి పదానికి ఒక అర్ధం వుంది. ఒక పరమార్ధం వుంది. దీన్ని జపించడం ద్వారా సమస్త దేవతలను
స్తుతించినట్టు కాగలదని పెద్దల భావన. ఈ మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం ఇలా చెబుతారు.

• ఓం – భగవంతుడు సర్వ రక్షకుడు.

• భూ: - ఉనికి కలిగినవాడు

• భువః – జ్ఞాన రూపుడు

• స్వః – ఆనంద స్వరూపుడు అంటే దుఖః రహితుడు

• తత్ – అటువంటి లక్షణాలు కలిగిన పరమేశ్వరుడు

• సవితు: - ఈ సమస్త విశ్వానికి సృష్టికర్త

• వరేణ్యం – అందరితో ఆరాధింపబడేవాడు

• భర్గః – పరిశుద్ధుడు

• దేవస్యః – ఆవిధమయిన దివ్య గుణములు కలిగిన దైవ స్వరూపుడు

• ధీమహి – ఆత్మలో ఏకమయిన

• యః – ఆ పరమేశ్వరుడు

• నః ధ్యః – మా బుద్ధులను

• ప్రచోదయాత్ – సత్కర్మలలో ప్రేరేపించి శ్రేయస్సు పొందేవిదంగా సమర్ధులను చేయుగాక.

ఇక మూలార్ధం తీసుకుంటే దాని భావం ఇలా వుంటుంది.

“ఓ భగవాన్!
‘ఏకకాలంలో సమస్త ప్రదేశాలలో వుండగలిగిన ఓ విశ్వరూపీ! అపరిమితమయిన శక్తికలిగిన ధీశాలీ! పరమేశ్వరా!
‘ఈ చరాచర ప్రపంచంలో లభ్యమయ్యే సమస్త జ్ఞానం నువ్వే. సర్వ ప్రకాశానివి నువ్వే. వరప్రదాతవు నువ్వే.
‘మాలో భయాన్ని పోగొట్టేది నువ్వే. ఈ విశ్వానికి సృష్టికర్తవు నువ్వే. సర్వోత్తముడివి నువ్వే. శిరసు వంచి నమస్కరిస్తున్నాము. మా మనస్సు, మేధస్సు సత్కర్మలవైపు ఆకర్షించబడేలా చూస్తూ సన్మార్గంలో నడిచేలా మాకు మార్గం చూపు.”

గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ కోణంలో నుంచి పరిశీలించినా అందులో ఎన్నో అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సాంప్రదాయిక అనుసరణలలో ఈ మంత్రంలో దాగున్న శాస్త్రీయ ప్రాధాన్యత కొంత మరుగునపడిపోయిందనే అనుకోవాలి.

ఆధునిక ఖగోళ శాస్త్రం చెబుతున్నదాని ప్రకారం మన నక్షత్ర మండలాన్ని పాలపుంత లేక ఆకాశ గంగ అంటారు. ఈ పాలపుంతలో మన భూమండలం కంటే లక్షల రెట్లు పెద్దవయిన లక్షల నక్షత్రాలు వున్నాయి.

ఈ నక్షత్రాలన్నీ మనకు నిత్యం కనబడే సూర్యుడి లాంటివే. మళ్ళీ ఇందులో ఒక్కో నక్షత్రానికి మళ్ళీ ఒక్కో సౌరమండలం వుంది. చంద్రుడు భూమిచుట్టూ తిరుగుతుంటే, ఆ చంద్రుడితో పాటు భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ వుంటుంది. ఈ విధంగానే నక్షత్ర మండలంలోవున్న లక్షలాది గ్రహాలన్నీ తమ నిర్దేశిత కక్ష్యలో గతితప్పక పరిభ్రమిస్తుంటాయి.

మనకు నిత్యం గోచరమయ్యే సూర్యుడు తన సౌర కుటుంబం లోని ఇతర గ్రహాలతో కలసి పాలపుంతల కేంద్ర స్తానాన్ని ఒక్కసారి చుట్టి రావాలంటే ఇరవై రెండు కోట్ల యాభయ్ లక్షల సంవత్సరాల కాలం పడుతుంది. ఈ అనంత విశ్వంలో ఈ పాల పుంతలు పరిభ్రమిస్తున్న వేగం గమనిస్తే కళ్ళు తిరగక మానవు. సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో అవి కదులుతున్నాయంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.
ఈ నేపధ్యాన్ని దృష్టిలో వుంచుకుని గాయత్రీ మంత్రాన్ని శాస్త్రీయ కోణం నుంచి పరిశీలిద్దాం.

• ఓం భూర్భు వస్వః - భూర్ అంటే భూమి, భువః – అంటే గ్రహాలు (సౌర కుటుంబం) స్వః - అంటే అసంఖ్యాక నక్షత్రాలతో కూడిన పాలపుంత (గెలాక్సీ)

ఇక్కడ ఓ చిన్న వివరణ – మనం ఇళ్ళల్లో వాడుకునే సీలింగ్ ఫాన్ రెక్కలు నిమిషానికి తొమ్మిదివందల సార్లు తిరుగుతాయి. ఆ వేగానికే అది చేసే చప్పుడు ఎలావుంటుందో అందరికీ అనుభవైకవేద్యమే. అలాటిది, ఈ అనంత విశ్వంలో అంతులేని సంఖ్యలో గెలాక్సీలు సెకనుకు ఇరవై వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తున్నప్పుడు ఉద్భవించే శబ్దం ఏవిధంగా వుంటుందన్నది ఊహాతీతం.

గాయత్రి మంత్రంలో చెప్పిన - ఓం భూర్భుస్వః – అనే ఈ బీజాక్షరాలు – ఈ చరాచర విశ్వంలోని గ్రహరాసులన్నీ కలసి తమ పరిభ్రమణ సమయంలో సృష్టిస్తున్న మొత్తం ధ్వని ఓంకారాన్ని పోలివున్నదన్న వాస్తవాన్ని తెలియచేస్తున్నాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేయ సంకల్పించిన విశ్వామిత్ర మహర్షి తపో దీక్షలో వున్నప్పుడు ఈ ధ్వనిని విని తన తోటి మునులకు దానిని గురించి తెలియచేసాడని ఐతిహ్యం. అప్పుడు వారందరూ కలసి ఈ ధ్వనికి ‘ఓం’ అని నామకరణం చేశారు. త్రికాలాల్లో వినవచ్చే శబ్దం కనుక భగవంతుడి పేరు మీద ఆ ధ్వనికి ఓం అని పేరు పెట్టారు.
కాబట్టి నిరాకారుడు,నిర్గుణుడు అయిన ఆ పరమేశ్వరుడుకి ఒక నిర్దిష్ట నామం ప్రసాదించడం అన్నది మొదటిసారి జరిగిందని విశ్వాసుల విశ్వాసం. అప్పటిదాకా
భగవంతుడికి ఒక రూపం అంటూ ఏమీ లేదని అందరు నమ్ముతూ వచ్చారు. అందుకే ఈ కొత్త వాస్తవాన్ని ఒక పట్టాన నమ్మడానికి ఎవరూ ముందుకు రాలేదు.
గీతాకారుడు కూడా అదే చెప్పాడు. “ ఓం ఏకాక్షరం బ్రహ్మ” అంటే ఈ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడి ఏకాక్షర నామమే ఓం.

అందుకే, ఋషులు ఈ శబ్దానికి ఉద్గితి అని కూడా పేరు పెట్టారు. అంటే స్వర్గం నుంచి వెలువడే సంగీత ఝరి అన్నమాట.

ఋషులు మరో విషయం కూడా కనుక్కున్నారు. అదేమిటంటే అనంత విశ్వంలో సెకనుకు ఇరవై వేలమైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్న గెలాక్సీలన్నీ కలిపి ½ MV2 కైనెటిక్ ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే తద్వారా చరాచర విశ్వం లోని గ్రహరాసులన్నీ కలిపి వినియోగిస్తున్న ఎనర్జీ ఏదో ఒక మేరకు సమతుల్యం కావడానికి ఇది దోహద పడుతోంది. దీన్నే గాయత్రిలో ప్రణవంగా పేర్కొన్నారు. అంటే గెలాక్సీలన్నీ కలసి ఉత్పత్తిచేసే ఎనర్జీకి స్టోర్ హౌస్ వంటిదన్నమాట.

తత్స వితుర్వరేణ్యం

తత్ అంటే ఆ (భగవంతుడు) సవితుర్ అంటే సూర్యుడు (నక్షత్రం) వరేణ్యం అంటే వందనానికి, గౌరవానికి అర్హత కలిగివుండడం.

ఒక వ్యక్తి రూపం, పేరుతొ సహా తెలిసినప్పుడు ఆ వ్యక్తిని చూడగానే పలానా అని అవగతమవుతుంది. రూపం, నామం రెండూ తెలవడం మూలాన నిరాకారుడయిన ఆ దేవదేవుడిని గుర్తించడానికి సరయిన పునాది దొరుకుతుందని విశ్వామిత్ర మహర్షి వాక్రుచ్చాడు.

ధ్వని ద్వారా (ఓంకార నాదం) కాంతి ద్వారా (సూర్యుడు, నక్షత్రాలు) మనకు తెలియని, మనకు కనబడని నిరాకారుడయిన భగవంతుడిని అర్ధం చేసుకోవచ్చు అని విశ్వామిత్ర మహర్షి చెప్పాడు.

ఇది యెలా అంటే- ఒక గణిత శాస్త్రజ్ఞుడు x2+Y2=4; if x=2 అనే కఠినమైన లెక్కకు ఇట్టే జవాబు చెప్పగలుగుతాడు. అలాగే, ఒక ఇంజినీర్ నది వొడ్డున నిలబడి తనవద్దవున్న ఉపకరణాల సాయంతో ఆ నది వెడల్పును అంచనా వేయగలుగుతాడు. వారి వారి రంగాలలో వారికున్న నైపుణ్యాన్ని బట్టి సాధ్యం అది అని ఎవరయినా ఒప్పుకుంటారు. విశ్వామిత్రుడు మనకు చెప్పింది ఇదే.

గాయత్రి మంత్రం లోని తరువాయి భాగాన్ని ఇలా అర్ధం చేసుకోవచ్చు.

భర్గో దేవస్య ధీమహి

భర్గో అంటే కాంతి; దేవస్య అంటే దేవత; ధీమహి అంటే ఉపాసించడం.
అందుబాటులో వున్న రూపంలో (సూర్య కాంతి) నిరాకారుడయిన భగవంతుడుడిని కనుగొనవలసిందని విశ్వామిత్రుడు మానవాళికి బోధించాడు. ఓంకారాన్ని జపిస్తూ
దేవుడిని పూజించాలని కూడా ఆయన చెప్పారు.
ఆయన చేసిన బోధ వినడానికి బాగానే వుంది. కానీ ఎల్లప్పుడు చంచలంగా వుండే
మనసుకు ఇది సాధ్యపడే పనేనా. అందుకే భగవంతుడిని ధ్యానించే విధానం కూడా గాయత్రి మంత్రంలో వుందని ఆ మహర్షే తెలియచేసాడు.

దియోయోనః ప్రచోదయాత్

ధియో (మేధావి), యో (ఎవరయితే),నః (మనమంతా), ప్రచోదయాత్ ( సరయిన తోవలో నడిపించే మార్గదర్శి) ఓ భగవంతుడా! సరయిన మార్గంలో నడిచేవిదంగా మా మేధస్సు మాకు ఉపయోగపడేలా చేయి.

ఈ నేపధ్యంలో గాయత్రి మంత్రాన్ని శాస్త్రీయ దృక్పధంలో చూసినట్టయితే అందులోని భావం ఇలా వుంటుంది.

భూమి(భుర్) గ్రహాలు (భువః) గెలాక్సీలు (స్వాః) అపరిమితమయిన వేగంతో సంచరిస్తున్నాయి. అవి ఆ క్రమంలో కనీ వినీ ఎరుగని ధ్వనికి కారణమవుతున్నాయి. నిరాకారుడయిన భగవంతుడుకి మరో రూపమే ఆ ధ్వని. దాని పేరే ఓం. ఆ (తత్) భగవంతుడే లక్షల కోట్ల సూర్యుల కాంతి (సవితుర్) రూపంలో తిరిగి ప్రభవిస్తున్నాడు. అలాటి దేవదేవుడు మన ఆరాధనకు (వరేణ్యం)అర్హుడు.

కాబట్టి, మనమందరం ఆ దేవతారూపమయిన (దేవస్య) కాంతి (భర్గో) ని ధ్యానించాలి. అదే సమయంలో ఓంకారనాదంతో కూడిన భజనలు చేయాలి. (యో) అట్టి భగవానుడు మనం సరయిన మార్గంలో (ప్రచోదయాత్) నడవగలిగే విధంగా మన (నః) మేధస్సు (ధియో) ఉపయోగపడేలా చేయాలి.

ఆనో భద్ర క్రతవో యన్తు విశ్వతః –రిగ్వేద

(అన్ని దిక్కులనుంచి మంచి ఆలోచనలు నాలోకి ప్రవేశించు గాక)

Sandhya Vandanam - Krishna Yajur Vedam _ Introduction in Telugu Part 1

Sandhya Vandanam - Krishna Yajur Vedam _ Introduction in Telugu Part 2

Sandhya Vandanam - Krishna Yajur Vedam _ Introduction in Telugu Part 3

Sandhya Vandanam - Krishna Yajur Vedam _ Introduction in Telugu Part 4

Sandhya Vandanam - Krishna Yajur Vedam _ Introduction in Telugu Part 5

Sandhya Vandanam - Krishna Yajur Vedam _ Introduction in Telugu Part 6- FINAL